మీరు ఒక లక్ష రూపాయలు దాయగలిగారంటే, మిమ్మల్ని అభినందించాల్సిందే!

మీరు డబ్బును బాగా ఆదా చేసే వారు అయ్యుండవచ్చు. అయితే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా..? ఆ డబ్బును బ్యాంకు ఖాతాలో అలానే ఉంచాలా లేదా ఇంకా బెటర్‌గా ఏదైనా చేయాలా?

అందుకే ముందు మీరు దాచిన లక్ష రూపాయలను ఏం చేయాలని నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరు 3 ప్రశ్నలను వేసుకోండి.

1.కొన్ని నెలల వరకు మీకు ఆదాయం లేకపోయినా సరే మీరు బతకడానికి సరిపోయే అంత డబ్బు ఉందా.

ఒకవేళ మీ దగ్గర అంత సరిపడా డబ్బు లేకపోతే మీరు దాచుకున్న డబ్బును అలాగే బ్యాంకు ఖాతాలో ఉంచడం మంచిది లేదా ఫిక్సిడ్ డిపాజిట్ చేయడం ఇంకా ఉత్తమం. మీకు అనిశ్చితి నెలకొన్న సమయాల్లో ఈ డబ్బు మీకు ఎమర్జెన్సీ ఫండ్‌లాగ ఉపయోగపడుతుంది.

మీకు ఇప్పటికే ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? అయితే మీకు మరొకసారి అభినందనలు! మీ తోటి వారితో పోల్చుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో వారి కంటే మీరు కొంచెం ముందు ఉన్నారు. ఇప్పుడు మీరు తరవాతి ప్రశ్నకు వెళ్ళవచ్చు.

2. రానున్న 1-5 సంవత్సరాల్లో మీరు ఏదైనా భారీగా ఖర్చు చేసే ప్లాన్‌లో ఉన్నారా..? మరి దానికి తగ్గట్టుగా పొదుపు కోసం ప్లాన్ చేశారా?

మీకు ఎమెర్జెన్సీ ఫండ్ ఉండి, ప్రస్తుతం చేతిలో ఉన్న డబ్బు అవసరం లేకపోయినా, లేదా దానితో ఏదైనా ప్లాన్ చేసి ఉంటే ఈ డబ్బును మీరు దానికే ఉపయోగించుకోండి. ఖర్చు వచ్చేవరకు డబ్బును ఏదైనా ఫిక్సడ్ డిపాజిట్‌లో దాయడం మంచి పని. మీ డబ్బు స్థిరమైన రేటుతో పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అదనంగా డబ్బును పొందుతారు.

ఒకవేళ మీకు ఎమెర్జెన్సీ ఫండ్‌ ఉండి పొదుపు చేసిన డబ్బుతో ఏదైనా ప్లాన్ చేస్తే సూపర్! మీరు అనుకున్నట్టే చేయండి.  మీరు మీ తోటివారితో పోలిస్తే మీరు చాలా బెటర్ అని చెప్పొచ్చు.

3. మీరు భవిష్యత్తు కోసం ఏదైనా ప్లాన్ చేశారా? ఏవైనా లాంగ్-టర్మ్ గోల్స్ ఉన్నాయా?

ఇప్పటి నుండి 20-30 సంవత్సరాలు తర్వాత ఎం జరుగుతుందో చెప్పడం కష్టమే, కానీ ప్రస్తుతానికి మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉండి పెద్దగా ఖర్చులు లేకపోతే మీ లక్షతో ఏదైనా లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదైనా తీసుకోవడం మంచి పని.

ఇందుకోసం లక్షను మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వృద్ధి చెందనివ్వండి. మీరు పదవీ విరమణ చేసే సమయానికి లక్ష చాలా పెద్ద మొత్తంగా మారుతుంది.

మీరు ఎమెర్జెన్సీ ఫండ్ కోసం జాగ్రత్తలు తీసుకునే రకమైన వ్యక్తి అయితే, రాబోయే ఐదేళ్ళలో రాబోయే ఖర్చులు ఇంకా పదవీ విరమణ కోసం కూడా ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం వంటివి చేసినట్లైతే మీరు మీ తోటి వారికంటే ముందున్నట్లు! ఆర్థిక పరమైన విషయాల్లో ముందు ఉన్నందుకు మా హృదయపూర్వక అభినందనలు. బహుశా మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది.

మీరు ఈ లక్ష రూపాయలతో ఏమి చేయాలనుకుంటున్నారు..? నిజానికి మీరు ఏం కావాలంటే అది చేయండి. మీరు ఇప్పటికే ఆ డబ్బును సంపాదించడానికి తగిన అర్హతను సంపాదించారు.