మీలో చాలా మంది నెట్‌ఫ్లిక్‌‌లో వచ్చే “నార్కోస్” అనే షోకి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. ముఖ్యంగా మొదటి రెండు సీజన్లు చాలా మందికి ఫేవరెట్‌. పాబ్లో ఎస్కోబార్ అంత డబ్బుని అక్రమంగానే ఎన్నో నేరాలు చేసి సంపాదించినా, ఆ షోలో అతని విలాసాలని చూసి ఈర్ష పడని వాళ్ళు ఉండరు. డబ్బు ఇచ్చే సంతోషాన్ని అనుభవించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? లోకం డబ్బుకి దాసోహం.

మీరు ధనవంతులు కావాలంటే మీకిప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి, మీరు ప్రస్తుతం సంపాదించేదానికన్నా చాలా ఎక్కువ సంపాదించి, దానిని మీ ప్రమేయం లేకుండానే మీకు సంపాదనని తీసుకురాగల వాటిలో పెట్టుబడి పెట్టడం లేదా ఒక 10-20 సంవత్సరాలు బాగా పొదుపు చేయడం. మీరు ఏ మార్గం ఎంచుకున్నా, ఒక సమయం వచ్చేసరికి మీ ఖర్చులకంటే మీ ఆదాయం ఎక్కువై ఉండాలి. పై రెండు మార్గాలలో ఒకటి వినడానికి బాగుంటే రెండోది కాస్త నిరుత్సాహపరిచే విధంగా ఉంది. 

మన ఖర్చులు అదుపులో లేకపోతే ఎంత సంపాదించినా వీధుల పాలు కావాల్సిందే అని చెప్పడానికి చాలా మంది సినిమా తారలు, ఫేమస్ ఆటగాళ్లు, మాఫియా లీడర్లు ఇవాళ ఒక ఉదాహరణగా నిలబడ్డారు. మీ తోటి వాళ్ళతో పోల్చితే మీ సంపాదన ఎక్కువైనంత మాత్రాన, మీ ఖర్చులని అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో కష్టం. అందుకే అనవసర ఖర్చులతో డబ్బుని వృధాగా ఖర్చు చేస్తున్నారేమో తెలుసుకోవడానికి ఈ నాలుగు విషయాలను పరీక్షించుకోండి. 

1. మీకు అత్యవసరమైనప్పుడు మీ నెల సంపాదనలో కనీసం 50% కూడా అందుబాటులో లేకపోవడం.

మీరు మిగతా వాళ్లతో పోల్చితే కాస్త ఎక్కువే సంపాదిస్తున్నా, నెల చివరికి డబ్బుకి కొరత ఏర్పడుతుంటే సమస్య ఉన్నట్టే. ఒకసారి మీరు నెలలో సంపాదించే డబ్బులో కనీసం 50% అయినా అవసరమైనప్పుడు ఆలోచించకుండా, అప్పు తీసుకోకుండా ఖర్చుచేయగల స్తోమత ఉందొ లేదో చూసుకోండి.

బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో సహజంగానే రెంట్, ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు అలాంటి సిటీలలో ఉంటున్నట్లు అయితే ఈ సిద్ధాంతం కచ్చితంగా వర్తించదు.

2. ఆరోగ్య సమస్యల కారణంగా కాకుండా, ఇతర కారణాల వల్ల మీరు అనుకున్నంత పొదుపు  చేయలేకపోయినా, లేదా మీ “సంపాదన” నెల నెలా తగ్గడం కూడా సమస్యే

ప్రతీ నెల ఖర్చుల తర్వాత మిగిలే డబ్బు తగ్గుతున్నా, లేదా ఖర్చులు క్రమంగా పెరుగుతున్నా, మీరు అనవసర ఖర్చులు చేస్తున్నారని అర్ధం. సంపాదనలో 30% పొదుపు చేయడం మంచి పని. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఖర్చులు సంపాదనలో 70% మించకూడదు.

కాబట్టి మీరు ఏడాదిలో మూడు నెలలకు పైన ఇలా కనీసం సంపాదనలో 20% అయినా పొదుపు చేయలేకపోతే ఒకసారి ఎంత ఖర్చవుతుందో లెక్కవేసుకోవడం మంచిది. సరదాలు ఉండకూడదని నేను చెప్పడం లేదు, కానీ సరదాల కోసం ఆర్థికంగా రిస్క్ చేయడం మంచిది కాదు.

క్రెడిట్ కార్డు బిల్లు క్రమంగా పెరుగుతుంది అంటే మీరు సంపాదనకు మించి ఖర్చు చేస్తున్నారని అర్ధం.

3. మీరు అస్తమాను క్రెడిట్ కార్డు మీద ఆధారపడుతుంటారు

మీ క్రెడిట్ కార్డు బిల్లు క్రమంగా పెరుగుతుంది అంటే మీరు సంపాదనకు మించి ఖర్చు చేస్తున్నారని అర్ధం. అంటే ఉద్దేశపూర్వకంగానే ఖర్చులన్నీ క్రెడిట్ కార్డుతో చేసి తర్వాత అంతా ఒకేసారి చెల్లించేటట్లు అయితే పర్లేదు, కానీ వచ్చిన శాలరీ సరిపోక క్రెడిట్ కార్డు మీద ఆధారపడుతున్నారు అంటే మాత్రం ఒకసారి పరీక్షించుకోవాల్సిన విషయమే. 

4. మీరు కట్టే (EMI) నెలసరి వాయిదాలు మీ సంపాదనలో 50% మించడం

మీరు సంపాదించే డబ్బులో 50% పైనే మీ లోను వాయిదాలకు పోతుంటే మీరు రిస్కులో ఉన్నట్టే. ఆ లోను మీ ఇంటికే అయి ఉండొచ్చు, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఖర్చుకి కూడా డబ్బు లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సిందే. అందుకే వీలైనంత త్వరగా కాస్త డబ్బు పొదుపు చేయండి. 

భవిష్యత్తులో ఇబ్బందులలో పడకుండాలంటే ముందుగా ఈ నాలుగు విషయాలను గ్రహించడం చాలా ముఖ్యం. అప్పుడు జీవితం సంతోషంగా గడుస్తుంది.